ఈనాడు రామోజీ, జ్యోతి ఆర్కే, జేడీల‌కు జ‌గ‌న్ శిక్ష‌… ఐదేళ్లు చాల‌వేమో…!

తాజాగా జ‌గ‌న్ స‌ర్కారుపై మ‌రోసారి ఎల్లో మీడియా దుమ్ముపోసింది! క‌డుపులో ఉన్న క‌సినంతా కుమ్మ‌రించేసింది. మాజీ ప్ర‌భుత్వ న్యాయ‌వాది ద‌మ్మాల‌పాటి శ్రీనివాస్ ఉదంతంపై పుంఖాను పుంఖాలుగా వార్త‌లు వండి వార్చిన ఓ వ‌ర్గం ఎల్లో మీడియా సంద‌ర్భోచితంగా .. జ‌గ‌న్‌ను ఏకేసింది. ఆయ‌న ప‌నిగ‌ట్టుకుని.. ద‌మ్మాల‌పాటిని వేధిస్తున్నార‌ని.. రాస్తూ.. ఈ సంద‌ర్భంగా పాత‌చింత‌కాయ‌ల‌ను పేర్చేసింది. ఎప్పుడో జ‌గ‌న్‌పై న‌మోదైన‌కేసుల‌ను వాదించి.. వాటిని సీబీఐకి అప్ప‌గించాల‌ని కోర‌డ‌మే పాపంగా ఇప్పుడు ద‌మ్మాల‌పాటిపై క‌సి తీర్చుకుంటున్నార‌ని ఈ క‌థ‌నం భారీ ఎత్తున వండి వ‌డ్డించింది.

అదే స‌మయంలో మోకాలికి.. బోడిగుండుకు ముడి వేస్తూ.. జ‌గ‌న్ కేసులను అప్ప‌ట్లో ఎర్ర‌న్నాయుడు, అశోక గ‌జ‌ప‌తిరాజు కోర్టుల్లో ఇంప్లీడ్ అయ్యార‌ని, అందుకే వారిని కూడా వేధిస్తున్నార‌ని, అశోక్‌ను మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి పీకేశార‌ని.. అచ్చెన్న‌ను జైలుకు పంపార‌ని.. పేర్కొంది. ఇదంతా కూడా జ‌గ‌న్ వారిపై పెంచుకున్న క‌క్ష నేప‌థ్యంలోనే సాగుతున్న వ్య‌వ‌హారంగా మీడియా జిగిబిగి అల్లిక‌లు అల్లేసింది. దీనిలో వాస్త‌వం తెలియ‌ని వారు.. ఇదంతా చ‌దివేసి.. నిజ‌మేనా?! జ‌గ‌న్ లో ఇంత కక్ష దాగి ఉందా?! అని అనుకోవ‌డం ఖాయం. కానీ, దీని లోతుపాతులు తెలిసిన వారు మాత్రం కొంత మేర‌కు ఆలోచ‌న చేస్తారు.

నిజానికి జ‌గ‌నే క‌సి తీర్చుకోవాల‌ని అనుకుంటే.. ఆయ‌నపై న‌మోదైన కేసుల విష‌యంలో వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌కు అవ‌కాశం ఇస్తే.. ఆయా వ్య‌క్తుల జాబితాను త‌యారు చేస్తే.. వారిపై కేసులు న‌మోదు చేయ‌డానికి, జైళ్ల‌లోకి నెట్ట‌డానికిఈ ఐదేళ్లు ఏం స‌రిపోతాయ‌నేది విశ్లేష‌కులు, విజ్ఞుల మాట‌. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ అరెస్టు చేయాల‌ని అనుకుంటే.. ముందుగా సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ను అరెస్టు చేయించాలి. ఎందుకంటే ఆయ‌నే క‌దా.. జ‌గ‌న్‌ను 16 నెలలు జైలుకు పంపింది. ఇక‌, మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్‌ను కూడాఅరెస్టు చేయించాలి. ఎందుకంటే అసెంబ్లీలో కేసుల విష‌యాన్ని ప్ర‌స్తావించి జ‌గ‌న్‌ను చుల‌క‌న‌గా మాట్టాడారు. అదేవిధంగా చంద్ర‌బాబు.. అరెస్టు కూడా జ‌రిగిపోయి ఉండాలి.

ఇలా ఈ జాబితాలో ఉన్న‌వారితోపాటు.. త‌నకు జైలు శిక్ష విధించిన న్యాయ‌మూర్తుల‌ను కూడా జ‌గ‌న్ విడిచి పెట్టే అవ‌కాశం లేన‌ట్టే క‌దా!! మ‌రి ఇవ‌న్నీ చేయ‌డానికి ఆయన‌కు ఐదేళ్లు కూడా స‌రిపోయే ప‌రిస్థితి లేదు. అయినా కూడా జ‌గ‌న్ క‌సితో ర‌గిలిపోతున్నార‌నే అనాలి. ప‌నిలోప‌నిగా.. త‌న‌పై కుట్ర‌లు, కుతంత్రాల‌ను పెచ్చరిల్లేలా రాసిప‌డిసే, ఏకేసి, అక్ష‌ర‌ శిక్ష‌లు వేసిన ఈనాడు రామోజీరావు, ఆంధ్ర‌జ్యోతి ఆర్కేల‌కు కూడా జ‌గ‌న్ శిక్ష‌లు వేసేయాలి. లేదా అరెస్టులైనా చేసేయాలి. కానీ ఇవ‌న్నీ జ‌ర‌గ‌లేదు క‌దా?! మ‌రి దీనిని ఎలా చూడాలి. ఏదేమైనా.. అస‌లు విష‌యాన్ని వ‌దిలేసి.. వారంతా అమాయ‌కులైన‌ట్టుగా ఎల్లో మీడియా వ్య‌వ‌హ‌రించ‌డం దానికి మాత్ర‌మే త‌గిన ప‌నిగా విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

 

-vuyyuru subhash