కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయం అయినట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి సీబీఐ విచారణను తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీబీఐ తనను అరెస్టు చేస్తుందని భావించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీం కోర్టు మెట్లు ఎక్కినా.. అక్కడ నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో అవినాష్ అరెస్టు ఖాయమని పలువురు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కడప జిల్లాలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లూ రాజకీయంగా తెరవెనుక ఉన్న వైఎస్ అభిషేక్‌రెడ్డి బుధవారం తెర ముందుకొచ్చారు. ఈయన సీఎం జగన్‌కు సమీప బంధువు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో కలిసి బుధవారం వైయస్‌ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండల పర్యటనలో పాల్గొన్నారు. అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటే పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు అభిషేక్‌రెడ్డికి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ప్రాథమికంగా లింగాల, సింహాద్రిపురం మండలాల వైకాపా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుండగానే ఎంపీ కార్యక్రమాల్లో తాజాగా ప్రత్యక్షమయ్యారు. అభిషేక్‌రెడ్డి విశాఖపట్నంలో వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి అన్న ప్రకాశ్‌రెడ్డి మనవడే అభిషేక్‌రెడ్డి. ఈయన ప్రత్యక్షంగా కనిపించడం చర్చనీయాంశమైంది.