వైఎస్ వివేకానందరెడ్డి హత్య చాలా రోజులు అవుతున్నా ఇప్పటివరకు కేసు ఓ కొలిక్కి రాలేదు. అయితే తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సుదీర్ఘకాలంగా న్యాయం కోసం పోరాడుతున్న డాక్టర్ సునితారెడ్డి ఇవాళ కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిశారు. వివేక హత్య కేసు గురించి ఎస్పీ కి వివరించారు. వివేకానందరెడ్డి హంతకులకు శిక్ష పడేవిధంగా పోలీసులు కూడా సహకరించాలని కోరారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డి అభ్యంతరకర పోస్టులపై సునీత ఎస్పీతో చర్చించారు.
అనంతరం ఆమె కడప నుంచి హైదరాబాద్ కి బయలుదేరి వెళ్లారు. విద్యాసాగర్ కంటే ముందు కడప ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజును కూడా గత ఆగస్టు నెలలో కలిశారు సునీత. తొలుత హోంమంత్రి అనితను కలిసి తండ్రి హత్య గురించి చర్చించారు. హోంమంత్రిని కలిసిన సమయంలో వివేకా హంతకులకు స్థానికుల పోలీసుల అండ లభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ విచారణకు పోలీసులు సహకరించేలా చూడాలని ఆమె హోంమంత్రిని కోరారు.