రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరించింది ఏపీ ప్రభుత్వం. గత వైసీపీ హయాంలో రెండు దఫాలుగా ఏబీవీ పై సస్పెన్షన్ వేటు వేసింది జగన్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం. 2020 ఫిబ్రవరి 2 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకూ మొదటి దఫా ఏబీవీని సస్పెండ్ చేసింది వైసీపీ ప్రభుత్వం.
ఆ తర్వాత రెండో విడతలో 2022 జూన్ 28 తేదీ నుంచి 2024 మే 30 తేదీ వరకూ మరోమారు సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు ఈ రెండు విడతల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా పేర్కోంటూ క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనాన్ని, అలవెన్సులను చెల్లించాలని పేర్కొంది. ఇక ఇటీవలే ఏబీ వెంకటేశ్వరరావు పై నమోదైన అభియోగాలను వెనక్కు తీసుకుంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే.