కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ శనివారం సాయంత్రం అమరావతికి చేరుకుని.. ఉండవల్లిలో తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. భాజపేతర శక్తులను కూడగట్టడంలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ సైతం మద్దతు పలికిన విషయం తెలిసిందే.. ఇందులో భాగంగానే ఇటీవలే ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో బాబు సమావేశమైన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగానే చంద్రబాబుతో తదుపరి చర్చలు జరిపేందుకు రాహుల్ ప్రతినిధిగా అశోక్ గెహ్లెట్ అమరావతి వచ్చారని పార్టీ వర్గాల సమాచారం.
ఈ సందర్భంగా గెహ్లెట్ మాట్లాడుతూ..దేశంలో భాజపా అనుసరిస్తున్న విధానాలపై పోరాడేందుకే కలిసి పోరాటం చేసి భాజపాను ఓడించేందుకే రాహుల్- చంద్రబాబు భేటీతో మహా కూటమి తొలి అడుగు పడిందన్నారు. రాహుల్ దూతగానే తాను అమరావతికి వచ్చానని వివరించారు. జాతీయ స్థాయిలో తదుపతి కార్యచరణపై చర్చించడానికి రాహుల్ వచ్చానని తెలిపారు. ఏపీలో టీడీపీతో కలిసి పని చేసే అంశాన్ని భవిష్యత్ లో చర్చిస్తామని అశోక్ గెహ్లెట్ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా భాజపేతర పార్టీలను ఏకం చేసి రానున్న ఎన్నికల్లో ప్రధానిని నిర్ణయించే స్థాయికి చేరుకుంటామని తెదేపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.