కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి బాలయ్య తన గొంతుక వినిపించారు.ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయలేదు కానీ తన ప్రతిపాదనలు మాత్రం వివరించి, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని విన్నవించారు.ఈ క్రమంలోజగన్ ఏ విధం అయిన నిర్ణయం తీసుకుంటారో అన్నది ఓ పెద్ద సందిగ్ధతతో కూడుకుని ఉంది.
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యులు, ప్రముఖ కథానాయకులు నందమూరి బాలకృష్ణ ఇవాళ ఓ వీడియో విడుదల చేశారు. తాజాగా జిల్లాల పునర్విభజనకు సంబంధించి రేగుతున్న వివాదంపై ఆయన స్పందించారు.పరిపాలన సౌలభ్యం కోసం ప్రతిపాదిత జిల్లాల ఏర్పాటును తాను ఆహ్వానిస్తున్నానని అన్నారు.
ఇదే సమయంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని, ఆ విధంగా అనంతపురం జిల్లాలో హిందూపురం లోక్ సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని, దీనికి హిందూపురంను జిల్లా కేంద్రంగా ఉంచి,సత్య సాయి జిల్లాగా నామకరణం చేయాలని కోరారు.హిందూపురం అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని, భవిష్యత్ లో ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర అవసరాల రీత్యా భూమి పుష్కలంగా ఉందని చెప్పారు.
తక్షణమే పుటపర్తి కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న అర్థం వచ్చేలా బాలయ్య మాట్లాడారు. తాజా నిర్ణయానుసారం పుట్టపర్తి జిల్లా కేంద్రంగా శ్రీ సత్య సాయి జిల్లాను ఏర్పాటు చేయాలని జగన్ ఇచ్చిన నోటిఫికేషన్ చూస్తే అర్థం అవుతుంది. ఇందులో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
దీనినే సత్య సాయి జిల్లాగా నామకరణం చేశారు. మడకశిర, హిందూపురం, పెనుకొండ,పుట్టపర్తి,కదిరి, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాలు, ధర్మవరం, పెనుకొండ,పుట్టపర్తి (కొత్త), 29 మండలాలు అనే మూడు రెవెన్యూ డివిజన్లు ఉండనున్నాయి. విస్తీర్ణం : 7771 చదరపు కిలోమీటర్లు అని, జనాభా : 17.22లక్షలు ఉంటుందని ప్రభుత్వ వివరాలు చెబుతున్నాయి.