మద్యపానం ఆరోగ్యానికి హానికరమో కాదో గాని మద్యపానం చేసి వాహనం నడపడం మాత్రం ప్రాణాలకు ప్రమాదం. తాగిన వాడి ప్రాణం పోవడం ఏమో గాని అతని వలన ఎదుటి వారు కూడా ప్రాణాలు కోల్పోవడం, లేదా జీవితం మొత్తం బాధపడటం. ముఖ్యంగా యువత తాగి వాహనాలు నడుపుతూ ఎందరినో బలి తీసుకోవడం మనం చూస్తున్నాం. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో డ్రంక్ డ్రైవ్ ఎక్కువగా జరుగుతుంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఇది మాత్రం కంట్రోల్ అవ్వడం లేదు అనేది వాస్తవం.
తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి మద్యం తాగి వాహనం నడపడానికి ప్రయత్న౦ చేస్తుండగా, మరో వ్యక్తి దానిని గమనించి అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అయినా సరే అతను బలవంతంగా వాహనం నడపడానికి చూడగా, గొడవ పడి కారు తాళం లాక్కుంటాడు. అనంతరం తమ కుటుంబానికి ఎదురైన అనుభవం వివరిస్తాడు. తమ సోదరుడు ఇలాగే ప్రాణాలు కోల్పోయాడని, ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్ లో మరణించినట్టు ఆ వీడియోలో మద్యం సేవించిన వ్యక్తికి హిత బోధ చేస్తాడు.
డ్రంక్ డ్రైవ్ వలన కుటుంబం నష్టపోయిన విషయాన్ని అతనికి చెప్పడంతో ఆ వ్యక్తి వాహనం నడపాలి అనే ఆలోచనను విరమించుకుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరు కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వాహనాలు నడపడంతో పాటు ఒళ్ళు అన్ని కళ్ళు చేసుకుని వ్యవహరించాల్సి ఉంటుంది. డ్రంక్ డ్రైవ్ అనేది ఎంత ప్రమాదమో గ్రహించి వ్యవహరించాలి.