ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే మూడు రోజుల్లో సంచలనాలు జరిగే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ఏపీలో టీడీపీ కీలక నేతలకు రాష్ట్ర ప్రభుత్వం గాలం వేసింది. రాయలసీమతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా కీలక నేతలను తమ పార్టీలోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.
ఇప్పటికే మాజీ మంత్రులు కొందరు వైసీపీ మంత్రులతో మాట్లాడుతున్నారని రాజకీయ వర్గాల్లో జోరు గా చర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న నేత కూడా వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తాజాగా రాయలసీమలోని కడప జిల్లాకు చెందిన జమ్మలమడుగు నియోజకవర్గ కీలక నేత మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు.
ఇక మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తో పాటుగా మాజీ ఎమ్మెల్యే మరొకరు కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక రాబోయే మూడు రోజుల్లో ఒక ఎమ్మెల్యే కూడా జగన్ ని కలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే సదరు ఎమ్మెల్యే తో ప్రకాశం జిల్లాకు చెందిన కీలక వైసీపీ మంత్రి ఒకరు చర్చలు కూడా జరిపారని అంటున్నారు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆయన బుధవారం మధ్యాహ్నం జగన్ ని కలవనున్నారు. ఇక కొందరు కీలక నేతలు కూడా ఇప్పుడు వైసీపీ నేతలతో నేరుగా టచ్ లో ఉన్నట్టు సమాచారం. కొందరు విజయసాయి రెడ్డి తో కూడా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇక రాజకీయంగా బలహీనంగా ఉన్న తెలుగుదేశ౦ పార్టీ ఇప్పుడు తమ నేతలను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.