కమలం పదునైన వ్యూహం..టార్గెట్ ఫిక్స్!

-

తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్న బీజేపీ ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో రాజకీయం చేస్తూ సత్తా చాటుతుంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. అయితే రాష్ట్ర నేతలు ఇప్పటికే దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ఇక వారికి కేంద్రం పెద్దలు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సాల్ బీజేపీ నేతలకు సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేశారు. ఈ టార్గెట్ ద్వారా పూర్తిగా ప్రజలని ఆకట్టుకోవడమే లక్ష్యంగా నేతలు ముందుకెళ్లనున్నారు.

రెండు నెలల్లో 9 వేల కార్నర్ మీటింగ్‌లు పెట్టాలని, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని మోదీ విజయాలు సహా.. సీఎం కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని,  ప్రతి ఇంటికి కమలం గుర్తు వెళ్లాలని నేతలకు బన్సల్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. అలాగే వీధి గోడలపై కేవలం కమలం గుర్తు మాత్రమే ఉండాలని, నేతల పేర్లు ఉండకూడదని సూచించారు.

ప్రతి వీధిలో కనీసం 300 మందితో కార్నర్ మీటింగ్‌లు ఏర్పాటు చేయాలని, అంటే బీజేపీ క్షేత్ర స్థాయిలో బలపడటానికి ఈ మీటింగ్‌లు పనికొస్తాయని అంటున్నారు. ఇక మిషన్ 90 టార్గెట్ తో ఇప్పటికే నేతలంతా వర్క్ చేస్తున్నారు. అటు బూత్ కమిటీలని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్ట్రాటజీలతో బీజేపీ ముందుకెళుతుంది. అదే సమయంలో పలు స్థానాల్లో బీజేపీకి బలమైన అభ్యర్ధులు లేరు.

దీంతో ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్ధులని నిలపడం కోసం..ఇతర పార్టీల్లో ఉన్న కీలక నేతలని పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు బీజేపీలోకి రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఈ వ్యూహంతో బీజేపీ ఏ మేర సక్సెస్ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version