ఒకపక్క ఓటమి.. మరోపక్క తమ్ముళ్ల సొంత నిర్ణయాలు.. వెరసి.. టీడీపీ అధినేత, అనుభవశీలుడు చంద్ర బాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి. మొత్తం 13 జిల్లాల్లోనూ దున్నేద్దామని అనుకున్న ఆయనకు జగన్ సునామీ తీవ్ర విఘాతం కలిగించింది. దీంతో రెండో సారి అధికారంలోకి వద్దామని భావించిన చంద్రబాబు చతికిల పడ్డారు. మరోపక్క, ప్రతిపక్షంగా వైసీపీపై పోరు చేద్దామంటే.. కలిసివస్తున్న నాయకులు కరువయ్యారు. ఇంకోపక్క పార్టీలో అసమ్మతి భారీ ఎత్తున పేట్రేగుతోంది. ఎక్కడికక్కడ ఎవరికి వారు తమ్ముళ్లు సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీని నడిపించడమే చంద్రబాబుకు అగ్నిపరీక్షగా మారిందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ అసంతృప్తులు రాజ్యమేలుతున్నారు. గుంటూరు, కృష్ణా వంటి కీలకమైన జిల్లాల్లోనే పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. ఎవరు ఎప్పుడు ఎటు వైపు నుంచి పార్టీ మారుతారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అదేసమయంలో ఇప్పుడు కొత్తగా తెరమీదికి వస్తున్న అసంతృప్తులు మరింతగా బాబుకు తలనొప్పి తెస్తున్నాయి.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా.. ఏకంగా బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు తెరదీస్తున్నారని పార్టీ నేతలే బాహాటంగా విమర్శిస్తున్నారు. అంతో ఇంతో ప్రజా బలం ఉన్న నాయకులు పార్టీ అధినేత పిలిచినా కూడా రాకుండా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంటే.. పెద్దగా ప్రజల బలం లేని నాయకులు, నామినేటెడ్ నాయకులు మాత్రమే పార్టీకి మిగులుతున్నారు. నిజానికి చంద్రబాబు యువరక్తాన్నినమ్మారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యు వ నాయకులకు ఆయన పెద్ద పీట వేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వారికి పెద్ద ఎత్తున టికెట్లు కూడాఇచ్చారు. వీరిలో దాదాపు అంతరూ కూడా ఓడిపోయారు.
అయితే, బాబు ఇచ్చిన టికెట్లు, తర్వాత ఆయన చేసిన ప్రచారం వంటివాటినైనా వారు పరిగణనలోకి తీసుకుని ఉంటే.. కనీసం ఇప్పుడు పార్టీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వచ్చి పార్టీని బతికించుకునేందుకు ప్రచారం అయినా చేయాలి. కానీ, ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ముందుకురాలేదు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు ఏదో చేయాలని అనుకున్నా.. ఇప్పుడు కదులుతున్న కూసాలకు ఆయన ఎలా పునాదులు పటిష్టం చేస్తారో ఆసక్తిగా మారింది.