రిషి సునాక్‌పై వివాదాస్పద మీమ్‌ రీట్వీట్‌.. బ్రిటన్‌ మంత్రిపై విమర్శలు

-

బ్రిటన్ ప్రధాని పదవి రేసులో ఉన్న రిషి సునాక్‌పై ఓ వివాదాస్పద మీమ్‌ను రీట్వీట్‌ చేసిన స్థానిక మంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను సునాక్‌ వెన్నుపోటు పొడిచేందుకు యత్నిస్తున్నట్లు కనిపిస్తోన్న ఆ మీమ్‌ను అక్కడి సాంస్కృతిక శాఖ మంత్రి నాడిన్ డోరీస్ తన ట్విటర్‌ అకౌంట్‌లో రీట్వీట్‌ చేశారు. ఇది కాస్త ఆమెపై విమర్శలకు దారి తీసింది.

సునాక్‌కు మద్దతు ఇస్తున్న వాణిజ్య మంత్రి గ్రెగ్ హ్యాండ్స్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఈ పోస్ట్ భీతిగొల్పేదిగా ఉందన్నారు. ‘పార్టీకి చెందిన ఓ ఎంపీ కత్తిపోట్లతో హత్యకు గురై ఇంకా ఏడాది కాలేదు. కాబట్టి.. ఇటువంటి పోస్టులు పంచుకోవడం చాలా చెడు, ప్రమాదకరమైన ఆలోచన’ అని వ్యాఖ్యానించారు. గతేడాది కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీ డేవిడ్ అమీస్‌ను ఓ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే.

‘మంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. కానీ.. కొందరి ప్రచారం తప్పుడు దారిలో సాగుతోంది’ అని టోరీ ఎంపీ ఒకరు ఆందోళన వ్యక్తంచేశారు. ‘జనరల్‌ ఎలక్షన్స్‌ సమయంలో నిర్వహించే మాదిరిగా సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం సాగుతోంది. కానీ.. ఇక్కడ ఓట్లేసేది పార్టీ సభ్యులు. ఇది గమనించాలి’ అని మరొక ప్రజాప్రతినిధి అన్నారు. అయితే.. ఇదొక వ్యంగ్య చిత్రంలాంటిదేనని డోరీస్‌ మద్దతుదారుల్లో ఒకరు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version