టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగులనున్నట్లు తెలుస్తోంది. ఆలేరు నుంచి టీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న బూడిద బిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆలేరులో కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉండేది.. అయితే కాంగ్రెస్ పార్టీని వీడి బిక్షమయ్య గౌడ్ కారెక్కారు. తనను ఓడించిన పార్టీలోనే బిక్షమయ్య గౌడ్ చేరారు. అయితే తాజాగా ఈయన బీజేపీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. క్రమంగా పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో పాటు ఎలాంటి నామినేటెడ్ పదవి రాకపోవడంతో టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
బిక్షమయ్య గౌడ్ గడిచిన రెండు సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ తరుపున 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో ఓడిపోయారు. ఆతరువాత జరిగిన పరిణామాలతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2009లో ఎన్నికల్లో బిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి కల్లెం యాదగిరి రెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు వరసగా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరితే ఆ ప్రాంతంలో బీజేపీ మరింతగా బలపడే అవకాశం ఉండటంతో పాటు.. బిక్షమయ్య గౌడ్ గెలిచే అవకాశాలు కూడా ఉంటాయని ఆయన అనుచరులు అనుకుంటున్నారు.