కర్నాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ దారుణమైన ఘటనతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఖననం చేసిన 5 నెలల తర్వాత మృతదేహం అదృశ్యమైంది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. పూర్తివివరాలు చూస్తే.. బాగల్‌కోట్ జిల్లాలోని రూగి గ్రామానికి చెందిన తిరమరట్టి రామప్ప అనే 63 ఏళ్ల వృద్ధుడు ఫిబ్రవరి 21న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించాడు. దీంతో ఆ మరుసటి రోజే ఆయన వ్యవసాయ పొలంలోనే ఆయన్ని ఖననం చేశారు.
అయితే ఇటీవలి కాలంలో కురిసిన వర్షాలకు ఆ సమాధి గుంత నీళ్ళతో నిండిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి చూస్తే అక్కడ శవం లేదు. దీంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఖననం చేసిన దాదాపు 5 నెలల తర్వాత శవం అదృశ్యం అవడం ఏంటని అయోమయంలో పడ్డారు. అయితే సోమవారం అమావాస్య సందర్భంగా క్షుద్రపూజలు చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు శవాన్ని తీసుకెళ్లినట్లు వారు భావిస్తున్నారు.