ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన తరుణంలో శుక్రవారం గుంటూరులోని సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చిన టీడీపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి నల్లపాడు, నగరంపాలెం పోలీస్ స్టేషన్లకు తరలించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, టీడీపీ గుంటూరు పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు తెనాలి శ్రావన్ కుమార్, గుంటూర ఈస్ట్ ఇన్‌చార్జి నజీర్ అహ్మద్, నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌లతో పాటు మొత్తం 60 మంది వరకు కేసు నమోదు చేసినట్టు సీఐ హైమారావు వెల్లడించారు.
నకిలీ డిగ్రీ పట్టాకు సంబంధించి బలమైన ఆధారాలు, సాక్ష్యాలు లభించడంతో ఎమ్మెల్సీ అశోక్ బాబును అరెస్ట్ చేశామని ఎస్పీ జీఆర్ రాధిక వివరించారు. ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉన్న పలుకుబడితో ఆధారాలను తారుమారు చేసేందుకు కూడా యత్నించారని వెల్లడించారు. ఇంటర్మీడియట్ విద్యార్హతతో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరాడు.
పదోన్నతితో పాటు ప్రధాన కార్యాలయంలో పోస్టింగ్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీకాం పట్టా పొందినట్టు ఒక దృవపత్రాన్ని ఆ శాఖకు అందజేశారు. నకిలీ సర్టిఫికెట్ అనుమానం కలిగి కొందరు ఉద్యోగులు లోకాయుక్తను ఆశ్రయించారు. లోకాయుక్త ఆదేశాల మేరకు సీఐడీ దర్యాప్తును చేపట్టి ఆధారాలు సేకరించిందని ఎస్పీ రాధిక వెల్లడించారు.