విండోస్ యూజర్లకు అలర్ట్.. వెంటనే మీ ఓఎస్​ అప్​డేట్ చేయాల్సిందే..!

-

చాలా మంది తమ కంప్యూటర్, ల్యాప్​టాప్​లలో ఉపయోగించేది ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్. విండోస్ ఓఎస్ వాడేవారికి ఓ హెచ్చరిక. అదేంటంటే వెంటనే మీరు మీ ఓఎస్​ను అప్​డేట్ చేసుకోవాలి. కేంద్ర సర్కార్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అదేనండీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా(సీఈఆర్​టీ-ఐఎన్) సూచించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్​లో లోపాలను గుర్తించినట్లు సీఈఆర్​టీ తెలిపింది. వీటి సాయంతో హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు ఓఎస్ సెక్యూరిటీ సిస్టమ్ విండోస్ డిఫెండర్ పనిచేయకుండా చేసి సైబర్ దాడికి పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

యూజర్​కు సంబంధించిన సమాచారం సులువుగా సైబర్ నేరగాళ్లకు చేరడంతో యూజర్ ప్రమేయం లేకుండా కంప్యూటర్​ను తమ అధీనంలోకి తీసుకోగలరని తెలిపింది. విండోస్ డిఫెండర్​లోని క్రెడెన్షియల్ గార్డ్​లోని బగ్ కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఈ బగ్ వల్ల 43 మైక్రోసాఫ్ట్ వెర్షన్లలో సమస్య తలెత్తినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థలు వెల్లడించాయి.

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1.5 బిలియన్‌ యూజర్లు విండోస్‌ ఓఎస్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపింది. భారత్‌లోని విండోస్‌ యూజర్లు వెంటనే తమ ఓఎస్​ను అప్‌డేట్ చేసుకోవాలని సీఈఆర్​టీ తమ నివేదికలో పేర్కొంది.

ఓఎస్‌ అప్‌డేట్ కోసం స్టార్ట్‌ మెనూపై క్లిక్ చేసి కంట్రోల్ ప్యానల్‌లోకి వెళితే విండోస్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే చివరిగా మీ ఓఎస్‌ ఎప్పుడు అప్‌డేట్ అయిందనేది తెలుస్తుంది. మీ కంప్యూటర్‌ ఆటో అప్‌డేట్‌ ఫీచర్‌ ఎనేబుల్ చేసుకుంటే మీ విండోస్‌ ఓఎస్‌ ఆటోమేటిగ్గా అప్‌డేట్ అవుతుంది.

అలానే క్రెడెన్షియల్‌ గార్డ్‌ బగ్‌ కారణంగా ప్రభావితమైన విండోస్‌ ఓఎస్‌ వెర్షన్‌ల జాబితాను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. వీటిలో విండోస్‌ 11, విండోస్‌ 10, విండోస్‌ సర్వర్‌ 2022, 2019, 2016లు ఉన్నాయి. ఈ లింక్ ను క్లిక్ చేసి నేరుగా CERT-IN వెబ్ సైట్ లోకి వెళ్లి ఓఎస్ కు సంబంధించిన వివరాలు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version