ఏపీ రాజకీయాల్లో టీడీపీ పరిస్థితి అందరికీ విదితమే. ఇప్పుడు అక్కడ పార్టీని నిలబెట్టేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. అయినా పార్టీ మాత్రం పుంజుకోవట్లేదు. వరుస ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలవుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ పార్టీని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసిన తర్వాతే తెలంగాణలో టీడీపీ పరిస్థితి గురించి ఆలోచించాలి. కానీ చంద్రబాబు మాత్రం ఒకేసారి రెండు పడవల ప్రయాణం అంటున్నారు. తెలంగాణలో మళ్లీ టీడీపీ పుంజుకునేలా చేయాలని ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఆయన గతంలో అమలు చేసిన వ్యూహాన్ని మరోసారి అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని మహాకూటమిగా పోటీ చేశారు. అయితే ఆంధ్రాలో ఓడిపోయిన తర్వాత ఆయన తెలంగాణ రాజకీయాల్లో చాలా సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు మళ్లీ ఇక్కడ ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం చాలా రోజుల తర్వాత ఆయన రీసెంట్ గా ఇక్కడి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
దీంతో ఈ విమర్శలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. పార్టీకి మొన్నటి వరకు అంతో ఇంతో నడిపించిన ఎల్.రమణను కేసీఆర్ లాగేసుకున్నారు. ఇక బక్కని నర్సింలుకు పగ్గాలు ఇచ్చినా ఆయన పెద్దగా నడిపించట్లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలా అయితే లాభం లేదని చంద్రబాబు రంగంలోకి దిగి మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావడంతో మళ్లీ ఆయనతో సన్నిహితంగా ఉండి రాబోయే కాలంలో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారంట. రేవంత్ కూడా టీడీపీ అండతోనే బలమైన నేతగా ఎదిగారు కాబట్టి ఇన్ డైరెక్టుగా టీడీపీకి సపోర్టు చేసే అవకాశాలు ఉన్నాయి.