మీ దృక్పథాన్ని మార్చుకోకుంటే ఎల్లప్పుడూ దుఃఖిస్తూనే ఉంటారని తెలిపే కథ..

-

ఒక విషయాన్ని నువ్వెలా చూస్తున్నావనే దాని మీదే నీ ఆనంద విషాధాలు ఆధారపడి ఉంటాయి. నువ్వు బాధపడాలనుకుంటే బాధపడతావు. సంతోషంగా ఉండాలంటే సంతోషంగా ఉంటావు. ఆనంద విషాదాలన్నీ నువ్వు ఆలోచించే విధానంలోనే ఉన్నాయని తెలిపే కథ.

ఒకానొక ఊరిలో ఒక ముసలావిడ ఉండేది. తన ఇద్దరు కూతుళ్ళకి పెళ్ళి చేసి ఒక్కత్తే ఉంటుంది. పెద్ద కూతురు భర్త గొడుగులు అమ్మే అతను. చిన్న కూతురు భర్త వడియాలు అమ్మే అతను. వీరిద్దరి బిజినెస్ గురించి ముసలావిడకి ఎప్పుడూ దిగులుగానే ఉండేది. బాగా ఎండలు కొడుతున్నప్పుడు గొడుగులు అమ్మడం కష్టం గనక, గొడుగుల బిజినెస్ తగ్గిపోతుందని, పెద్ద కూతురు ఎలా బతుకుందని బాధపడుతుంది. అలాగే వర్షం పడుతున్నప్పుడు చిన్న కూతురు వడియాలు తడిసిపోతున్నాయని, వ్యాపారంలో నష్టం వస్తుందని బాధపడుతుంది.

ఇలా రోజూ ఏదో ఒక విషయం మీద ఏడుస్తూనే ఉంటుంది. అది చూసి చుట్టు పక్కల వారందరూ ఆమెని ఏడుపుగొట్టు ముసలావిడ అంటూ ఎద్దేవా చేసేవారు. ఒకసారి అటుగా వెళ్తున్న ఒక సన్యాసి ఆమె ఏడుపును గమనించి, అసలేమైందని అడిగాడు. దానికి పూర్తిగా తన సమస్యని చెప్పింది. అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నాడు. ఎండలు కొడుతున్నప్పుడు బాగా వడియాలలు అమ్ముడవుతున్నాయని నీ చిన్న కూతురి జీవితం గురించి ఆలోచించు. అలాగే వానలు పడుతున్నప్పుడు నీ పెద్ద కూతురు జీవితానికి ఢోకా లేదని అనుకో. ఇలా ఆలోచిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలపడంతో అర్థం చేసుకున్న ముసలావిడ అప్పట్నుండి సంతోషంగా ఉండడం మొదలెట్టింది.

చాలా మంది అంతే. సంతోషంగా కనిపించే వాటి గురించి ఆలోచించడం మానేసి బాధలని మీదేసుకుంటారు. అందుకే ఆనందం ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version