కామారెడ్డి జిల్లాకు కేసిఆర్ వరాలు.. మున్సిపాలిటీకి 50 కోట్లు..ఒక్కో గ్రామానికి 10 లక్షలు !

సిద్దిపేట పర్యటన అనంతరం.. కామారెడ్డికి వెళ్లారు సిఎం కేసీఆర్. ఈ సందర్బంగా కామారెడ్డి జిల్లాలో సమీకృత కలెక్టరేట్ ఆఫీసు మరియు పోలీసు భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో నూతన కలెక్టరేట్ భవనం ఉండగా.. వంద గదులతో సమీకృత కలెక్టరేట్ ఆఫీసును నిర్మించారు. అన్ని శాఖలు ఒకే చోట నుంచి పనిచేసేలా భవనాలు నిర్మించారు. ఇక కలెక్టరేట్ ఆఫీసు ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో కామారెడ్డి జిల్లాకు వరాల వర్షం కురిపించారు సీఎం కేసీఆర్. కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 50 కోట్లు, బాన్సువాడ మరియు ఎల్లారెడ్డి మున్సిపాలిటీలకు 25 కోట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

అలాగే కామారెడ్డి జిల్లాలోని గ్రామాల అన్నిటికీ పది లక్షల చొప్పున ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. కామారెడ్డి పట్టణానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని… కామారెడ్డి కి వచ్చే ఏడాది లో మెడికల్ కాలేజీ వస్తుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది కొన్ని అనివార్య కారణాల వల్ల మెడికల్ కాలేజీ రాదని వచ్చే ఏడాది మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డి మరియు ఎల్లారెడ్డికి కాళేశ్వరం నీరు అందిస్తామని.. చెప్పిన పనిని నిబద్ధతతో ఆచరిస్తారు అని పేర్కొన్నారు. తెలంగాణలో ఇకముందు కూడా కరెంటు కొరత ఉండబోదని.. దేశంలో ఒక్క తెలంగాణలోనే 24 గంటలు రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నామని గుర్తు చేశారు.