ప్రపంచవ్యాప్తంగా అనేక హిందూ ఆలయాలు ఉన్నాయి. ఇప్పటికీ అనేక దేశాల్లో పలు పురాతన ఆలయ నిర్మాణాలు బయట పడుతూనే ఉన్నాయి. ఇక కంబోడియాలోనూ అలా బయటపడిందే ఒక దేవాలయం ఉంది. అంకోర్‌వట్ పేరిట ఆ ఆలయాన్ని పిలుస్తారు. ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ఆలయంగా పేరుగాంచింది.
కంబోడియాలోని మెకాంగ్ నది సమీపంలో సుమారుగా 162.6 హెక్టార్ల విస్తీర్ణంలో అంకోర్‌వట్ ఆలయం ఉంటుంది. ఇందులో విష్ణువును పూజిస్తారు. దీన్ని 12వ శతాబ్దంలో ఖ్మెర్ వంశానికి చెందిన రాజులు నిర్మించారని చెబుతారు. ఇక ఈ ఆలయంలో ఒక్కో రాయి సుమారుగా 500 కిలోల వరకు బరువు ఉంటుంది. దీంతో ఆ రాళ్లను తరలించేందుకు భారీ యంత్రాలు కావాలి. కానీ అప్పట్లోనే ఎలాంటి యంత్ర సహాయం లేకుండా అంత భారీ రాళ్లను ఆలయం వద్దకు ఎలా తరలించారో ఇప్పటికీ అంతుబట్టని మిస్టరీగా మారింది.
ఆలయానికి సమీపంలో ఉండే కల్లెన్ అనే పర్వతం నుంచి కెనాల్ ద్వారా ఆ భారీ రాళ్లను తెచ్చి వాటిని చెక్కి ఆలయంగా మలిచారని చెబుతారు. కాగా ఆలయాన్ని మొత్తం 1 కోటి రాళ్లతో నిర్మించారని అంటారు. ఇక 16వ శతాబ్దం వరకు ఈ ఆలయం ఎవరికీ కనిపించలేదు. దట్టమైన అడవులు ఉండడం కారణంగా అప్పట్లో ఆ పని సాధ్యం కాలేదు. కానీ 16వ శతాబ్దంలో మళ్లీ ఆలయాన్ని గుర్తించారు. అప్పటి నుంచి ఆ ఆలయాన్ని పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఎంతో పురాతనమైన ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని ఎవరికైనా ఆసక్తి ఉంటే కంబోడియా వరకు వెళ్లాల్సిందే.