కరోనా వైరస్‌కు పుట్టినిల్లైన చైనాలో ఆ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో శుక్రవారం ఒక్కరోజే 10,729 కొత్త కేసులు వెలుగుచూశాయి. జీరో కొవిడ్ పాలసీ అమలు చేసిన పెద్ద మొత్తంలో కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల్లో అందరికీ లక్షణాలు లేవని అక్కడి అధికారులు వెల్లడించారు. కొవిడ్ పాజిటివ్‌ల సంఖ్య పెరగడంతో రాజధాని బీజింగ్‌లోని పార్కులను మూసివేశారు. దేశవ్యాప్తంగా మరోసారి కఠిన ఆంక్షలను విధిస్తున్నారు.
గ్వాంగ్‌జౌ, చాంగ్‌కింగ్ నగరాల్లో దాదాపు 50 లక్షలమంది కఠిన లాక్‌డౌన్ ఆంక్షల మధ్య ఉన్నారు. రాజధాని బీజింగ్‌లో 118 కొత్త కేసులు వెలుగుచూడటంతో అక్కడ ఉన్న 2.10 కోట్ల మందికి రోజువారీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలన్నీ ఆన్‌లైన్ తరగతులకే పరిమితమయ్యాయి. ఆస్పత్రులు అత్యవసర సేవలకే పరిమితమయ్యాయి. దుకాణాలు, రెస్టారెంట్లు మూతపడి.. అందులో పనిచేసే సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు.జీరో కొవిడ్ వ్యూహంతో లక్షలాది మంది ఇళ్లకే పరిమితం కావడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. కేసులు భారీగా ఉన్న నగరాలు మినహాయించి.. మిగతా నగరాల్లో ఉన్నవారిని నిర్బంధం నుంచి విడిచిపెడతామని అధికారులు చెప్పారు.