రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించినందున తాము స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ అగ్ని రాజుకున్నట్టయింది. వాస్తవానికి అప్పటి వరకు కూడా కరోనా గురించి పెద్దగా తెలియనివారు కూడా తెలుసుకున్నారు. కరోనా వస్తే.. ఎన్నికలు కూడా వాయిదా వేస్తారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా సీరియస్ అయింది.
రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ ఉన్న మాటను అంగీకరిస్తూనే దీనికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసు కుంటున్నామని, రాష్ట్రంలో కరోనా మన వారికి ఎవరికీ రాలేదని, వచ్చినా.. సమర్ధంగా ఎదుర్కొంటామని ప్ర భుత్వం పేర్కొంది. అంతేకాదు, ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధిం చి అటు సీఎం జగన్, ఇటు సీఎస్ సాహ్ని లుకూడా కమిషనర్‌కు విన్నవించారు. ఈ సమయంలోనే ఓ కీలక పాయింట్‌ను వారు లేవనెత్తారు. అదేంటే.. ఇప్పుడిప్పుడే కరోనా ఎఫెక్ట్ దేశంలో కనిపిస్తోందని, వచ్చే రోజుల్లో ఇది విజృంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆరు వారాలు వాయిదా వేయడం వల్ల.. తర్వాత పరిణామాలు మరింతగా దిగజారే అవకాశం ఉంటాయని, దీంతో మరింతగా ఎన్నికలను వాయిదా వేయాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుందని, సో.. ఇప్పుడు ఎన్నికలను నిర్వహించడమే సబబని వారు విజ్ఞప్తి చేశారు. నిజానికి సాధారణ ప్రజలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ పెద్దగా కనిపించడం లేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలను నిలిపి వేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. నిజానికి ఇప్పుడు నిలిపి వేసినా.. ఆరు వారాల తర్వాత అది అదుపులోకి వస్తుందని ఎక్కడా చెప్పలేమని అంటున్నారు. మరి ఇంతమంది విజ్ఞప్తులు చేసిన తర్వాతైనా ఎన్నికల కమిషనర్‌లో మార్పు వస్తుందేమో చూడాలి.