ఈటల రాజేందర్ అంటే హుజూరాబాద్‌లో తిరుగులేని శక్తి. 20ఏళ్లుగా ఆ గడ్డమీద అపజయమనేదే ఎరుగకుండా విజయఢంకా మోగిస్తున్న నేత. ప్రతి ఇల్లు ఆయనకు సుపరిచితమే. ప్రతి కార్యకర్తా ఆయన ఆయన మనిషే. ఎంపీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కచోట కూడా టీఆర్ ఎస్‌కు మెజారిటీ రాలేదు. కానీ ఒక్క హుజూరాబాద్‌లో మాత్రమే 70వేలకు పైగా మెజార్టీ వచ్చింది.
అంటే ఆ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఈటల ఎంత గట్టిగా పాతారో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి వ్యక్తిని ఆ నియోజకవర్గంలో ఒంటరి చేయడమంటే మాటలా? ఇన్ని రోజులు గంగుల కమలాకర్ టీఆర్ ఎస్ కేడర్ తో, ఈటల అనుచరులతో వరుసగా మీటింగులు పెట్టారు.
ఈటల వెంట నడవొద్దని, పార్టీ వైపు ఉండాలని కోరారు. అయితే కొందరు మాత్రమే పార్టీకి జై కొట్టారు. చాలామంది ఈటల వెంటే ఉంటామని, పదవులు ఉన్నా లేకున్నా ఈటల రాజేందరే తమ నాయకుడని తేల్చి చెప్పారు. దీంతో హుజూరాబాద్ రాజకీయాల్లో గంగుల ఫెయిల్ అయ్యాడని టీఆర్ ఎస్ అధిష్టానం భావించింది. అందుకే ట్రబుల్ షూటర్ హరీశ్‌రావును రంగంలోకి దింపింది. హరీశ్‌రావు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి గంగుల కాస్త సైలెంట్ అయ్యారు.