కరోనా ఉద్ధృతి భాగ్యనగరంలో పలు చోట్ల కనిపిస్తోంది.కొన్ని చోట్ల స్థానిక ఆస్పత్రులు అన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. మొదటి రెండు విడతల కన్నా ఈ దఫా వేరియంట్ (ఒమిక్రాన్) అంత ప్రమాదకారి కాకపోవడంతో కొంత ఉపశమనంగా ఉన్నా, కేసుల సంఖ్య మాత్రం అనూహ్య రీతిన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తప్పని సరి అని తరుచూ విన్నవించే పోలీసు మరియు వైద్య ఆరోగ్య శాఖలను కూడా కరోనా కలవరం వెన్నాడుతోంది. అందుకే మాస్క్ ఫస్ట్ డ్యూటీ నెక్స్ట్ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని పదే పదే ఆ రెండు శాఖలూ విన్నవిస్తున్నాయి..ఇక వివరాల్లోకి వెళ్తే….
నైట్ కర్ఫ్యూ విధించినప్పుడు కానీ లాక్డౌన్ పెట్టినప్పుడు కానీ పోలీసు యంత్రాంగం చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. కొన్నిసార్లు కన్నవాళ్లే పట్టించుకోకుండా వదిలేసిన ఘటనల్లో పోలీసులే మానవత్వం చూపి వారికో అండగా నిలిచారు. వారిని ఆస్పత్రుల్లో చేర్చి వైద్యులకు తగు సాయం కోరి, తోచినంత నగదు సాయం ఇచ్చిమరీ! వారిని సొంత మనుషుల్లా చూసుకున్నారు. అంతేకాదు పోలీసు స్టేషన్లకు వచ్చే వారికి కూడా మాస్క్ తప్పని సరి అని ఎన్నో సార్లు చెప్పారు. కొందరి నిర్లక్ష్యం కారణంగానే ఆర్జేఎన్ఆర్ స్టేషన్లో ఏకంగా 16 మందికి కరోనా సోకడం ఓ విధంగా పండుగ వేళ ఇదొక విషాదం.వీళ్లంతా వేగం వేగంగా కోలుకోవాలని ఆశిద్దాం. తిరిగి విధుల్లో చేరి మునుపటి ఉత్సాహంతో పనిచేయాలని భగవంతుడ్ని వేడుకుందాం.