టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది కమెడియన్లు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు.. అయితే అందులో కొంతమంది మాత్రమే చిరస్థాయిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారు. అలాంటి వారిలో ఆర్య చిత్రంలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను అలరించిన బబ్లూ కూడా ఒకరు. తేజ తెరకెక్కించిన చిత్రం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన బబ్లూ పెద్ద స్టార్ కమెడియన్ కాలేదు కానీ దాదాపు ప్రతి ఒక్క స్టార్ హీరో సినిమాలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా పలువురి సినిమాలలో నటించిన ఈయన ఆ హీరోల సినిమాలలో బాగా పాపులర్ అయిన సన్నివేశాలలోని కనిపించాడు.. కానీ పెద్దగా పాపులారిటీ దక్కించుకోలేదు. ఇకపోతే వాస్తవానికి ఈయన కామెడీ టైమింగ్ వల్ల పొట్ట చెక్కలయ్యే విధంగా నవ్వుకున్న దాఖలాలు కూడా పెద్దగా లేవని చెప్పాలి. అందుకే ఈయన ఎవరు అంత త్వరగా గుర్తు పట్టరు. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో బబ్లూ ఒక సినిమాలో కూడా కనిపించలేదు. దీంతో ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అనే విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి.
ఇంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బబ్లూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. స్టార్ హీరోలతో పనిచేసినప్పుడు ఆయనకి కలిగిన అనుభూతితో పాటు సినిమాలకు దూరం అవడానికి గల కారణాన్ని కూడా వెల్లడించారు. అతడికి తన తండ్రి అంటే చాలా ఇష్టమని కానీ కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆయన మరణించాడని అప్పట్నుంచి బబ్లూ జీవితం మారిపోయిందని.. చాలాకాలం ఏ సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకోలేకపోయాను అంటూ కన్నీటి పర్యంతమయ్యారు బబ్లూ. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని మంచి అవకాశం వస్తే మళ్లీ రీఎంట్రీ ఇస్తానని తెలిపారు.