ప్రతిపక్ష స్థానంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్..జగన్‌ని ధీటుగా ఎదురుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా? వారు ఎన్ని రకాలుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నా సరే..ప్రభుత్వానికి ప్రజా మద్ధతు తగ్గడం లేదా? అంటే తగ్గడం లేదనే ప్రతి సర్వే చెబుతుంది..ప్రజానాడి అర్ధమవుతుంది. జగన్ ప్రభుత్వం మంచి పాలన అందించడంలో అన్నీ రకాలుగా విఫలమైందని, దాడులు, కేసులు, అరాచక పాలన కొనసాగిస్తుందని, అలాగే పథకాల పేరుతో రూపాయి ఇచ్చి..పన్నుల రూపంలో పది రూపాయిలు కొట్టేస్తున్నారని బాబు, పవన్ ఆరోపణలు చేస్తున్నారు.
ఇక వైసీపీలో ప్రతి నేత అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, వాలంటీర్లని అడ్డం పెట్టుకుని ప్రజల డేటాని దొంగిలిస్తున్నారని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అభివృద్ధి లేదని, కనీసం రోడ్లు, తాగునీరు కూడా అందించడం లేదని బాబు, పవన్ ఫైర్ అవుతున్నారు. బాబు, పవన్ ప్రజల్లో తిరుగుతూ, రోడ్ షోలు, బహిరంగ సభలు ఏర్పాటు చేసి విరుచుకుపడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు బయటకొస్తూ..జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.
మొన్నటివరకు బాబు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు టూర్ వేశారు. తాజాగా శ్రీకాకుళంలో బాబు పర్యటన ముగిసింది. అదే రోజు విశాఖలో పవన్ మూడో విడత వారాహి యాత్ర మొదలైంది. ఒకే రోజు ఇద్దరు నేతలు..జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేసి విరుచుకుపడ్డారు. ఇలా ఇద్దరు నేతలు పదే పదే జగన్ ప్రభుత్వంపై మాటల దాడి చేస్తున్నారు.
ఇన్ని రకాల విమర్శలు, ఆరోపణలు చేస్తే జగన్ ప్రభుత్వానికి నెగిటివ్ అవ్వాలి. కానీ అదేం జరగడం లేదు. ఇప్పటికీ ప్రజా మద్ధతు జగన్‌కే ఉందని సర్వేలు తేలుస్తున్నాయి. అయితే జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అతి పెద్ద ప్లస్ గా మారుతున్నాయి. ఇటు అభివృద్ధి కార్యక్రమాలని కూడా నిదానంగా మొదలుపెట్టారు. జగన్ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవనే భావన ఉంది. కాబట్టి జగన్ బలం తగ్గించడంలో బాబు-పవన్ విఫలమయ్యారనే చెప్పవచ్చు.