ఎడిట్ నోట్: పాదయాత్రతో ‘సైకిల్’ పరుగెత్తేనా!

-

ఏపీలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చి..ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా యువ నేత నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది..పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణుల మధ్య లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. అయితే ఈ పాదయాత్ర ద్వారా టీడీపీకి కొత్త ఊపు వస్తుందా? ఆ పార్టీ అధికారంలోకి రాగలదా అనే అంశాలు ఒక్కసారి పరిశీలిస్తే..గత ఎన్నికల్లో దారుణంగా ఓడి ప్రతిపక్షానికి పరిమితమైన టీడీపీని  అధికార వైసీపీ ఎప్పటికప్పుడు కోలుకోలేని దెబ్బ తీస్తూనే ఉంది.

కానీ ఆ పరిస్తితులని దాటి టీడీపీ గాడిన పడేలా అధినేత చంద్రబాబు చేశారు..ఈ వయసులో కూడా కష్టపడి ఓ వైపు పార్టీ నేతలని యాక్టివ్ చేసి, వారికి దిశానిర్దేశం చేస్తూనే…మరోవైపు అధికార వైసీపీపై పోరాడుతూ..ప్రజల్లో తిరుగుతూ..చాలా వరకు పార్టీని పికప్ చేశారు. ఇక టీడీపీకి ఆదరణ పెరిగిందని చెప్పడానికి..ఆ మధ్య బాబు రోడ్ షోలకు వచ్చిన ప్రజా స్పందన అని చెప్పాలి.

అయితే బాబు కొంతవరకు పార్టీకి ఊపు తీసుకొచ్చారు. కానీ దాంతో  అధికార బలంతో ఉన్న వైసీపీకి చెక్ పెట్టడం ఈజీ కాదని చెప్పాలి.  ఇదే సమయంలో లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది. ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా కలియతిరిగి..ప్రజల మధ్యలో ఉంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ లోకేష్ ముందుకెళ్లనున్నారు. ఈ పాదయాత్ర టీడీపీని అధికారంలోకి తీసుకొస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

 

ఇక పాదయాత్ర ద్వారా ప్రధానంగా యువత ఓట్లని ఆకట్టుకోవడం లోకేష్ మెయిన్ టార్గెట్. ఎందుకంటే కొత్తగా వచ్చే యువ ఓటర్లు వైసీపీ, జనసేన వైపు ఎక్కువ ఉన్నారు..టీడీపీ వైపు తక్కువ చూస్తున్నారు. అందుకే వారి మద్ధతు పెంచుకోవాలని చూస్తున్నారు. అదే సమయంలో లోకేష్ ఒక ప్రజా నాయకుడుగా ఎదిగేందుకు మంచి అవకాశం దొరికినట్లే అని చెప్పాలి. గతంలో నామినేటెడ్ పదవి ద్వారా మంత్రి అయ్యారు. ఆ తర్వాత మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు.

దీంతో లోకేష్‌ని వైసీపీ ఓ రేంజ్ లో ఎగతాళి చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఎగతాళి చేసిన వారికి చెక్ పెట్టాలంటే లోకేష్ ఓ బలమైన నాయకుడుగా ఎదగాలి. ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ ఓ పర్ఫెక్ట్ నాయకుడు అవుతాడని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తానికి పాదయాత్రతో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లోకేష్ టార్గెట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version