తెలంగాణలో ఎన్నికల సమయం ఆసన్నమైంది..కరెక్టుగా చూసుకుంటే మరో 6 నెలల్లో ఎన్నికల ప్రక్రియ మొదలైపోతుంది. ఇక ఎన్నికల సమరం మొదలుకానుండటంతో రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రజా బాట పట్టాయి. ప్రజలని మెప్పించి ఎన్నికల్లో గెలవడానికి ఎవరు వ్యూహాలు వారికి ఉన్నాయి. ముచ్చటగా మూడోసారి కూడా గెలిచి అధికారం దక్కించుకోవాలని బిఆర్‌ఎస్ పార్టీ చూస్తుంది. ఈ క్రమంలోనే బిఆర్‌ఎస్ నేతలు ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు.
అభివృద్ధి పనులు ప్రారంభం..సంక్షేమ పథకాలు అందించడం..ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని ప్రారంభించడం చేస్తున్నారు. ఓ వైపు కేసీఆర్..మరో వైపు కేటీఆర్ ప్రజల్లోనే ఉంటున్నారు. హరీష్ రావుతో సహ మంత్రులంతా జిల్లా జిల్లా తిరిగేస్తున్నారు. బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు..ప్రజల్లోనే ఉంటున్నారు..ఇంటింటికి తిరిగి..ప్రజలకు తాము ఏం చేశామో చెప్పి..మళ్ళీ ప్రజల మద్ధతు పొందాలని చూస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనలు పేరిట ప్రజలతో కలిసిపోతున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ ఈ సారైనా అధికారంలోకి రావాలని కష్టపడుతుంది. పార్టీలో విభేదాలని పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం నేతలు పనిచేయడం మొదలుపెట్టారు. కీలక నేతలంతా హత్ సే హత్ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. అటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇటు సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క పాదయాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్రలతో ప్రజా బలం పెంచుకోవాలని చూస్తున్నారు.
ప్రజాగోస-బీజేపీ భరోసా పేరుతో బీజేపీ రాష్ట్రమంతా తిరిగేస్తుంది..ఇప్పటికే కార్నర్ సమావేశాలు నిర్వహించి సక్సెస్ అయింది. ఇటు ప్రజా సమస్యలపై బండి సంజయ్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఇక సంస్థాగతంగా బలపడే దిశగా ఇతర పార్టీల్లోని నాయకులను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. అసలు బిఆర్‌ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనే విధంగా బిజేపి ముందుకెళుతుంది.
ఇక సీపీఐ, సీపీఎం పార్టీలు కేంద్రప్రభుత్వ విధానాలపై ప్రధానంగా పోరాటం సాగిస్తున్నాయి. స్తానిక సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై సీపీఎం ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర జరుగుతుంది. త్వరలో సీపీఐ ఆధ్వర్యంలో కూడా మోదీ హాటావో… దేశ్‌కి బచావో అనే నినాదంతో యాత్రలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు తెలుగుదేశం సైతం తెలంగాణలో యాక్టివ్ అయింది. కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మళ్ళీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. మార్చి 29న టిడిపి ఆవిర్భావ సభని గ్రాండ్ గా చేసేందుకు రెడీ అయ్యారు. ఇక వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, అటు బిఎస్‌పి కీలక ప్రవీణ్ కుమార్ ప్రజల్లో ఉండి పోరాడుతున్నారు. ఇలా అన్నీ పార్టీలు ప్రజా బాట పట్టాయి.