ట్విటర్​కు కొత్త బాస్​ను వెతుకుతున్న ఎలాన్ మస్క్​..!

-

ట్విటర్​ను కొనుగోలు చేసినప్పటి నుంచి షాకుల మీద షాక్​లు ఇస్తున్న ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఈసారి కాస్త గట్టి షాకే ఇచ్చారు. ట్విటర్​ సీఈవోగా మస్క్ బాధ్యతలు మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబరులో ట్విటర్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి తన నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మస్క్‌ ట్విటర్‌ సీఈవోగా కొనసాగాలా? లేక వైదొలగాలా? అని ప్రశ్నిస్తూ పోల్‌ నిర్వహించారు. ఈ పోల్​లో ఎక్కువ మంది యూజర్లు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో విధానపరమైన మార్పులకు సంబంధించి నిర్వహించే పోల్‌లో కేవలం ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రైబర్లు మాత్రమే పాల్గొనేందుకు వీలుగా మార్పులు చేయనున్నట్లు తెలిపారు. అయితే, యూజర్లు తనకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ట్విటర్‌ సీఈవోగా వైదొలగాలని మస్క్‌ భావిస్తున్నారట. ఈ మేరకు ట్విటర్‌కు కొత్త బాస్‌ను అన్వేషించే పనిలో ఆయన నిమగ్నమైనట్లు వార్తలు వెలువడుతున్నాయి.

‘‘ట్విటర్‌కు కొత్త సీఈవోను కనుక్కోవడం సమస్య కాదు. ట్విటర్‌ను సమర్థవంతంగా కొనసాగించగలిగే సీఈవోను పట్టుకోవడమే సవాల్‌’’ అని ట్వీట్ చేశారు.‘‘ ట్విటర్‌ను సమర్థవంతంగా కొనసాగించే ఉద్యోగం ఎవరికీ అవసరంలేదు. ఇందుకోసం వారసులు ఎవరూ లేరు ’’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో మస్క్‌ ట్విటర్‌ సీఈవోగా కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి, యూజర్ల అభిప్రాయం మేరకు ట్విటర్ సీఈవో వైదొలగి కొత్త వ్యక్తిని నియమిస్తారా? లేదంటే తనే ఆ స్థానంలో కొనసాగుతారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version