సాధారణంగా పొట్టేలు అనగానే మాంసాహారులకు నోరూరుతుంది. కానీ కర్ణాటకలో ఓ రైతు మాత్రం వాటిని వ్యవసాయానికి ఉపయోగిస్తున్నాడు. నాగలి దున్నడం, ఎడ్ల బండిని లాగడం వంటి పనులకూ పొట్టేళ్ల సాయమే తీసుకుంటున్నాడు. మరి ఆ వ్యక్తి అలా ఎందుకు చేస్తున్నాడు. వాటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నాడో తెలుసుకుందాం.
ఇలా వినూత్నంగా వ్యవసాయాన్ని చేస్తున్న రైతు పేరు శేకప్ప కురుబర్. కర్ణాటక.. హవేరీ జిల్లా సావనూరు తాలుకాలోని జల్లాపూర్ గ్రామం. వృత్తి వ్యవసాయం. అందరి లాగా కాకుండా తాను వ్యవసాయాన్ని భిన్నంగా చేయాలని ఆలోచించాడు. శేకప్ప.. తనకు ఉన్న ఒకటిన్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పలు రకాల పంటలను పండించేవాడు. తన పొలంలో నాగలి దున్నడానికి ఎద్దులు, ఆవులకు బదులు పొట్టేళ్లను వాడుతున్నాడు.
అందరూ నాగలి దున్నడానికి ఎద్దులు, ఆవులను ఉపయోగిస్తారు. కానీ శేకప్ప మాత్రం పొట్టేళ్లను ఉపయోగిస్తున్నాడు. ఒక్కోదానికి రూ.6500 చొప్పున వెచ్చించి 2 పొట్టేళ్లను శేకప్ప కొనుగోలు చేశాడు. వాటికి కనక, రాయన్న అని పేర్లు కూడా పెట్టాడు. వాటికి బండిని లాగడం, నాగలి దున్నడం నేర్పించాడు. దీంతో గత 9 నెలలుగా వాటితోనే వ్యవసాయం చేస్తున్నాడు. శేకప్ప చేసే వ్యవసాయం చూసి చుట్టు పక్కల ఉన్న రైతులు కూడా స్ఫూర్తిని పొందుతున్నారు.