గోదావరికి పెద్దప్రమాదమే తప్పింది.. ఎగిరిపడ్డ పట్టాల మధ్య సిమెంట్ దిమ్మెలు..

-

ఈ రోజు ఉదయం కాకినాడ నుంచి సికింద్రాబాద్‌ వైపు వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే.. సుమారు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ బీబీనగర్‌ వద్ద పట్టాలు తప్పడంతో ఒక కిలోమీటర్‌ వరకు కంకరరాళ్లు, ట్రాక్‌ మధ్యన ఉండే సిమెంట్‌ దిమ్మెలపైనే వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే.. కిలో మీటర్‌ మేరకు కంకర రాళ్లపై దూసుకెళ్లిన రైలు బోగీలు ఒక పక్కకు వాలిపోయాయి. దీంతో.. భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగీలను నుంచి బయటకు వచ్చి రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏర్పాట్లలో తమతమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదంలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ మరమ్మతుల పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే.. రైల్వే ట్రాక్‌ మధ్య ఉండాల్సిన సిమెంట్‌ దిమ్మెలు ముక్కలు ముక్కలుగా పడిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితిని పరిశీలించిన అధికారులు నివ్వెర పోతున్నారు. ఇంతలా ట్రాక్‌ ధ్వంసమైనా గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం వాటిల్లకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. అయితే.. ఘట్‌కేసర్‌ సమీపంలో కర్వ్‌ ఉన్న చోట ట్రైన్‌ ట్రాక్‌ పై వెళ్తున్న సమయంలో సుమారు 70 కిలోమీటర్ల స్పీడ్‌లో ఉంది.. ఆ సమయంలో రైలు బోగీలు పట్టాలు తప్పినట్లు అనుమానం వచ్చిన లోకో పైలెట్‌ వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో కొంత దూరం వరకు ట్రైన్‌ కంకర రాళ్లు, ట్రాక్‌ మధ్య ఉన్న సిమెంట్‌ దిమ్మెలపై వెళ్లింది. ఈ క్రమంలో కంకర రాళ్లు చెల్లాచెదరు కాగా, ట్రాక్‌ మధ్యన ఉన్న సిమెంట్‌ దిమ్మెలు తునాతునకలయ్యాయి. ట్రైన్‌ ఆగడంతోనే రైలులో ఉన్న ప్రయాణికులు బయటకు దిగారు. అంతలోనే ట్రైన్‌ ప్రమాదంపై అధికారులు సమాచారం అందటంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇదంతా చూసిన వారంత గోదవరికి పెద్ద ప్రమాదమే తప్పిందని చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version