సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ త్వరలో గూగుల్ కార్డ్ పేరిట నూతనంగా ఓ డెబిట్ కార్డును లాంచ్ చేయనున్నట్లు తెలిసింది. ఇందుకు గాను ఇప్పటికే సిటీ బ్యాంక్‌తో ఆ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. కాగా గూగుల్ కార్డ్ రెండు రూపాల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఫిజికల్, వర్చువల్ రూపంలో ఈ కార్డును యూజర్లు వాడుకోవచ్చు. అతి త్వరలోనే బిగ్ సర్‌ప్రైజ్‌గా గూగుల్ ఈ కార్డును లాంచ్ చేయనున్నట్లు తెలిసింది.
గూగుల్ కార్డులోకి యూజర్లు తమ బ్యాంక్ అకౌంట్ ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అనంతరం ఆ కార్డును గూగుల్ ప్లే స్టోర్‌కు లింక్ చేసి అందులో కొనుగోళ్లు జరపవచ్చు. ఇందుకు గాను కార్డులో వీసా, మాస్టర్ కార్డ్ పేమెంట్ గేట్‌వేలకు సపోర్ట్‌ను అందివ్వనున్నారు. దీంతో మరింత సురక్షితంగా యూజర్లు ఆన్‌లైన్‌లో పేమెంట్లు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ కార్డుకు గాను వినియోగదారులు ఫిజికల్ కార్డును కూడా రిక్వెస్ట్ చేసి దాన్ని ఉపయోగించుకోవచ్చు.
అయితే గూగుల్ కార్డ్‌పై గూగుల్ ఇప్పటికీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.