గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటి మేయర్ పదవులను కైవసం చేసుకునేందుకు కసరత్తులు చేస్తోంది అధికార టిఆర్ఎస్. ఈ వారంలోనే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనుంది. ఆ సమావేశం తర్వాత మేయర్, డిప్యూటి మేయర్ ఎవరో అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గ్రేటర్ హైదరబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక డివిజన్ లను కైవసం చేసుకుంది టిఆర్ఎస్. ఆ తర్వాత ఎంఐఎం, బిజేపిలు ఉన్నాయి. జిహెచ్ఎంసి మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యులు విడుదల చేసింది. దీంతో ఈ పదవులను దక్కించుకునేందుకు గులాభి పార్టీ సమాలోచనలు చేస్తుంది. ఫలితాలు వచ్చిన తర్వాత మేయర్ పీఠంపై ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం జరుగుతుంది. తాజాగా టిఆర్ఎస్ తన వ్యూహాన్ని మార్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో గ్రేటర్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించేందుకు టిఆర్ఎస్ సిద్దమవుతుంది..
ఇప్పటికే మేయర్, డిప్యూటి మేయర్ పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు.. పార్టీ పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పలువురు కార్పొరేటర్లు నేరుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను కలిసి తమకు చాన్స్ ఇవ్వాలని కోరినట్టు సమాచారం. పలువురు ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గ పరిధిలో గెలిచిన వ్యక్తికి డిప్యూటి మేయర్ పదవి ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆశవహులకు పార్టీ పెద్దల నుంచి ఎలాంటి హమీలు దక్కలేదనే చర్చ జరుగుతోంది.
అయితే ఈ రెండు పదవులకు అధికార పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు సైతం ఎవరికి ఈ పదవులు దక్కుతాయన్న లెక్కలేసుకునే పనిలో పడ్డారు.