ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఆర్మీ సిబ్బంది కోసం కొత్తగా కేజీసీ కార్డ్ పేరిట నూతన క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ఆర్మీ ఉద్యోగులు, సిబ్బంది సులభతరమైన పద్ధతిలో ఈ కార్డును పొందవచ్చు. కేవలం కేవైసీ పత్రాలను సమర్పించి వారు ఈ కార్డును పొందేందుకు వీలుంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డు తరహాలో ఈ కార్డు పనిచేస్తుంది. ఈ కార్డులను వాడేవారికి రూ.10 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ లభిస్తుంది.
ఆర్మీ సిబ్బంది కేజీసీ కార్డు ద్వారా వ్యక్తిగత అవసరాల కోసం డబ్బు తీసుకుని వాడుకోవచ్చు. లేదా వ్యవసాయం చేసేవారు అందుకు గాను అయ్యే పెట్టుబడి, పంట చేతికొచ్చిన అనంతరం చేసే పనులకు అవసరం అయ్యే డబ్బు కోసం కూడా ఆ కార్డును వాడుకోవచ్చు. దీని వల్ల దేశంలోని సుమారుగా 45 లక్షల మంది ఆర్మీ సిబ్బందికి ప్రయోజనం కలుగుతుంది.
ఈ కార్డుల ద్వారా ఆ సిబ్బంది రుణాలను కూడా పొందవచ్చు. ఈ కార్డులను పొందేందుకు గాను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచ్ లను సందర్శించవచ్చు. లేదా ఆ బ్యాంక్‌కు చెందిన ఇ-కిసాన్ ధన్ యాప్ ద్వారా కూడా కార్డుకు అప్లై చేయవచ్చు. ఇక రుణ సదుపాయం కోసం 1800 120 9655 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేయాల్సి ఉంటుంది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్డును ప్రవేశపెట్టినట్లు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.