తెలంగాణలో కొద్దిరోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులువంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగులు దుంకుతున్నాయి. హైదరాబాద్ మహానగరంతోపాటు వరంగల్ లాంటి పట్టణాలు జలమయం అయ్యాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. ప్రధానంగా మురికివాడల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 23 మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది.
దీని కారణంగా చాలా ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ సహా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.