ఎంతో ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫెస్టివల్ లో సుందర్ పిచాయ్ పై హీరో మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ ఏడాది కూడా భారతీయ చిత్రాలు సందడి చేస్తున్నాయి. నటుడు మాధవన్ స్వీయదర్శకత్వంలో నటించిన ‘రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్’ చిత్రం కూడా కేన్స్ లో ప్రదర్శించబోతున్నారు. ఈ సందర్భంగా కేన్స్ లో తన చిత్రానికి ప్రచారం నిర్వహిస్తున్న నటుడు మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ వద్ద తెరకెక్కించదగిన ఎన్నో కథలు ఉన్నాయని వెల్లడించారు.
నాటి ఆర్యభట్ట నుంచి నేటి సుందర్ పిచాయ్ వరకు ప్రతిదీ సినిమా కథకు అర్హమేనని అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన అద్భుతగాథలు భారత్ లో ఉన్నాయని, అయితే అలాంటివారిపై సినిమాలేవీ రావడంలేదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు వారు స్ఫూర్తి ప్రదాతలు అని మాధవన్ పేర్కొన్నారు. సుందర్ పిచాయ్ వంటి వ్యక్తులకు సినిమా వాళ్ల కంటే ఎక్కువమంది అభిమానులు ఉంటారని వ్యాఖ్యానించారు.