హిమపర్వతాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఇవాళ ఉదయం 8 గంటలకు హిమాచల్ ప్రదేశ్ లో ప్రారంభమైన ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ సాగనుంది. రాష్ట్రంలోని 68 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు- 55,07,261 ఉండగా అందులో పురుషులు 27,80,208, మహిళా ఓటర్లు 22,27,016 ఉన్నారు. ఇక తొలిసారి ఓటు వేయబోయే యువ ఓటర్లు 1,86,681 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు 7,881 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్ జరగనుంది.
ఈ ఎన్నికలకు మొత్తం 7881 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 789 పోలింగ్ బూత్‌లు సమస్యాత్మకమైనవిగా, 397 పోలింగ్ బూత్‌లో అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 2017 ఎన్నికల్లో 75.57శాతం పోలింగ్ నమోదైంది. లాహౌల్-స్పితి జిల్లాలోని స్పితి ప్రాంతంలోని తాషిగ్యాంగ్‌లో 15,256 అడుగుల ఎత్తులో ఈసీ బూత్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ 52 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.