Aamir Khan: ఈ మధ్యకాలంలో సినిమాలు, వెబ్ సిరీస్ లే కాదు.. కమర్షియల్ యాడ్స్ కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. సున్నితమైన ఆంశాలను చర్చించడంతో ఆగ్రహానికి గురవుతున్నాయి. ఆ యాడ్స్‌లో నటించే వాళ్లు కూడా అనుకోకుండా చిక్కులో పడుతున్నారు. ఇలాంటి యాడ్లు ఎలా చేస్తారని సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు.
కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్.. పెళ్లి బట్టల బ్రాండ్ కోసం తీసిన ‘కన్యాదాన్’ యాడ్ లో నటించి విమర్శలపాలైంది. అప్పట్లో కొన్ని సంఘాలు రచ్చ రచ్చ చేశాయి. ఆలియా క్షమాపణలు చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందనకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఆమె నటించిన అండర్వేర్ యాడ్ అసభ్యకరంగా ఉందని నెటిజన్ల ఆగ్రహనికి గురైంది. సెటైర్లకు బలైంది.
ఈ వివాదాలు మరిచిపోకముందే ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్, సీనియర్ హీరో అమీర్ ఖాన్ అనుకోని సమస్యలో ఇరుక్కున్నారు. ఆయన రీసెంట్గా నటించిన సీయట్ టైర్స్ యాడ్ పై తీవ్ర దుమారం రేగుతోంది. ఆ యాడ్‌లో ఆయన చెప్పిన మాటలే ఆయన్ని చిక్కుల్లో పడేశాయి. రోడ్లు ఉంది టపాకులు పేల్చడానికి కాదు’ అంటూ తన ఎదురుగా ఉన్న జనాలకు క్లాస్ పీకుతూ టైర్ల యాడ్ ను ప్రమోట్ చేశారు.
అయితే ఈ మాటలపై హిందు సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. టపాసులు కాల్చవద్దు అని చెబుతూ యాడ్ తీయడం ఏంటీ అంటూ.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సీయట్ టైర్స్ కంపెనీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.