కరోనా పుట్టినిల్లు చైనాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజు కరోనా కేసులు పెరుగుతుండడంతో మహా నగరం షాంఘై సిటీలో లాక్ డౌన్ ప్రకటించారు. అయితే ఇప్పటికి కరోనా కేసులు అదుపులోకి రావడం లేదు. చైనాలో కరోనా కేసుల సంఖ్య తగ్గించేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కేసులు తగ్గకపోవడంతో మరింత కఠినంగా లాక్ డౌన్ ఆంక్షలను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కరోనా సోకినా వారు బయటకు రాకుండా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న షాంఘై నగరంలో ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
ఇప్పటికే అనేక ప్రాంతాలను అధికారులు బారికేడ్లతో మూసివేశారు. ఇప్పుడు కరోనా సోకిన వారి ఇండ్ల చుట్టూ పెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడం అక్కడ కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. దాదాపు రెండు మీటర్ల ఎత్తు ఉన్న పెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షాంఘై నగరంలో దాదాపు రెండున్నర కోట్ల మంది పౌరులు ఉన్నారు. కరోనా ప్రభావంతో ప్రజలు ఇళ్లల్లోనే ఉండటంతో చాలామందికి ఆహారం, మంచి నీళ్లు కూడా దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.