ఆంధ్రప్రదేశ్ లో అధికారుల తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాధినేత కు వాళ్ళు రాజకీయంగా కూడా సహకారం అందిస్తున్నారు అనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ విమర్శలు ఎక్కువగా చేస్తుంది. పోలీసు అధికారులు కూడా చట్టాలను ఉల్లంఘించడంపై ఇప్పుడు హైకోర్ట్ కూడా ఆగ్రహంగా ఉంది.
తాజాగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భంగా ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గురువారం సీఎంఓ అధికారి, విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేశ్ వైసీపీ లాంగ్ లీవ్ అంటూ ట్వీట్ చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు జగన్ సర్కార్ లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు.
‘‘పదేళ్ల క్రితం ఇదే రోజున వైసీపీని స్థాపించారని ఆయన ట్వీట్ చేసారు. ప్రజా సాధికారిత కోసం కృషి చేస్తున్న వైసీపీ చిరకాలం వర్ధిల్లాలని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మొక్కవోని దీక్ష, అవిశ్రాంత కృషి పార్టీని నేటి ఈ ఉచ్ఛస్థితికి చేర్చాయని పేర్కొన్నారు. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రతిజ్ఞపూనుదామని ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక అధికారి ఇలా బహిరంగంగా ఒక పార్టీకి మద్దతు పలకడం చర్చనీయాంశం అయింది.