కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు సిద్ధమవుతున్న హైదరాబాద్‌ నిమ్స్‌..!

-

ఫార్మా కంపెనీ భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (బీబీఐఎల్‌) రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌కు గాను ఫేజ్‌ 1, 2 హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు డ్రగ్‌ కంట్రోల్‌ బోర్డు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఇప్పటికే అనుమతులు జారీ చేసిన విషయం విదితమే. బీబీఐఎల్‌ తయారు చేసిన కోవ్యాక్సిన్‌కు దేశవ్యాప్తంగా 12 చోట్ల క్లినికల్‌ ట్రయల్స్‌ జరపాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నిర్ణయించింది. ఇక ఆ ట్రయల్స్‌ జరగనున్న 12 ఇనిస్టిట్యూట్లలో హైదరాబాద్‌ నిమ్స్‌ కూడా ఉంది. దీంతో నిమ్స్‌లో ఇప్పుడు కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

icmr asked hyderabad nims to fast track covaxin clinical trials

హైదరాబాద్‌ నిమ్స్‌లో కోవ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను వేగంగా పూర్తి చేయాలని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) డాక్టర్‌ బలరాం భార్గవ నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.మనోహర్‌కు తాజాగా లేఖ రాశారు. ట్రయల్స్‌ను వేగంగా పూర్తి చేసి ఫలితాలను అందజేయాలని కోరారు. ఇందుకు గాను వాలంటీర్ల ఎంపిక ప్రక్రియను జూలై 7వ తేదీ లోపు పూర్తి చేయాలని, ఆ తరువాత వెంటనే ట్రయల్స్‌ ప్రారంభించాలని అన్నారు. అయితే డాక్టర్‌ మనోహర్‌ ఒకటి రెండు రోజుల్లో హాస్పిటల్‌ ఎథిక్స్‌ కమిటీతో సమావేశమై ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

కాగా నిమ్స్‌తోపాటు దేశంలో మొత్తం 12 చోట్ల కోవ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. వీటి ఫలితాలను వీలైనంత త్వరగా అందజేయాలని ఇప్పటికే ఐసీఎంఆర్‌ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కోవిడ్‌ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ను కూడా అతి వేగంగా పూర్తి చేసి మందును పంపిణీ కోసం సిద్ధం చేయాలని ఐసీఎంఆర్‌ భారత్‌ బయోటెక్‌కు సూచించింది. అందుకనే ఐసీఎంఆర్‌ కోవ్యాక్సిన్‌కు ఆగస్టు 15ను డెడ్‌లైన్‌గా విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news