హైదరాబాద్ హైటెక్‌సిటీలో ఈ మధ్యే స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఫర్నిచర్ స్టోర్ ఐకియా లాంచ్ అయిన విషయం విదితమే. అందులో ఫర్నిచర్‌తోపాటు రెస్టారెంట్ కూడా ఉంది. చాలా తక్కువ ధరకే బిర్యానీని పెడుతున్నారు కూడా. అయితే ఆ రెస్టారెంట్‌లో బిర్యానీ తిన్న ఓ వ్యక్తి ఖంగు తిన్నాడు. ఎందుకంటే.. అందులో గొంగళి పురుగు వచ్చింది మరి..!
ఐకియా స్టోర్‌లో ఉన్న రెస్టారెంట్‌లో బిర్యానీ తిన్న వ్యక్తికి ప్లేట్‌లో గొంగళి పురుగు రావడం కలకలం రేపింది. ఇటీవలే స్టోర్‌కు వెళ్లిన మహమ్మద్ అనే వ్యక్తికి ఐకియా స్టోర్‌లో బిర్యానీ తింటుండగా అందులో గొంగళి పురుగు కనిపించింది. ఈ విషయాన్ని అతడు స్టోర్ మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. అంతేకాకుండా ట్విట్టర్ ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని చేరవేశాడు. కాగా దీనిపై స్పందించిన జీహెచ్‌ఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు స్టోర్‌లో తనిఖీలు నిర్వహించారు.
స్టోర్‌లోని ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు.. వాటిని పరీక్షలు నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అదేవిధంగా ఐకియాకు 11,500 రూపాయల జరిమానా విధించారు. కాగా ఈ ఘటనపై ఐకియా ప్రతినిధులు స్పందిస్తూ.. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని.. మరోసారి ఇలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ఇలా బిర్యానీలో గొంగళి పురుగు కనిపించడం అందరినీ షాక్‌కు గురి చేసింది.