అన్ని రకాల క్రికెట్ నుంచి భారత క్రికెటర్ నామన్ ఓజా తప్పుకున్నాడు. 37 ఏళ్ల నామన్ ఓజా అన్ని ఫార్మాట్స్ నుంచి తప్పుకుంటున్నా అని ప్రకటించాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మాన్ అయిన ఓజా… 2010 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. కాని ఒక్క వన్డే మాత్రమే ఆడాడు. ఆ తర్వాత తన మొదటి అంతర్జాతీయ టి 20 మ్యాచ్ ని వారం రోజుల్లోపే ఆడాడు. రెండు టి20 లు ఆడి ఆ తర్వాత కనపడలేదు.
పరిమిత ఓవర్ల క్రికెట్ కి అతన్ని తిరిగి పిలవకపోగా, 2015 లో శ్రీలంక పర్యటనలో టెస్ట్ మ్యాచ్ లో చోటు కల్పించారు. 3 వ టెస్టులో గాయపడిన వృద్దిమాన్ సాహా స్థానంలో భారత్ తరఫున తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ లో పర్వాలేదనిపించాడు. రెండు ఇన్నింగ్స్‌లలో 21 మరియు 35 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ లో ఇండియా గెలిచింది. ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు.
అయితే అంతర్జాతీయ క్రికెట్ కి అతన్ని ఎంపిక చేయకపోవడంపై చాలా మంది అసహనం వ్యక్తం చేసారు. మోస్ట్ టాలెంటేడ్ క్రికెటర్ గా కొందరు చెప్తూ ఉంటారు. దేశవాళి మ్యాచుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఎనిమిదవ రంజీ ఆటగాడిగా నిలిచాడు. మధ్యప్రదేశ్ తరుపున రంజీ మ్యాచ్ లు ఆడిన అతను 7,861 పరుగులు చేసాడు. రంజీ ట్రోఫీలో వికెట్ కీపర్‌గా అతను చేసిన 351 పరుగులు టోర్నమెంట్ చరిత్రలో అత్యధికం. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో, ఓజా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సహా పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.