ఇప్పటికే ధరల కుతకుత.. ఇకపై పామాయిల్ సలసల ..

-

ఇప్పటికే గుండు సూది నుంచి మొదలుకుని నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో దాని ప్రభావం ఇతర రంగాలపై తీవ్రంగా పడుతోంది. పెట్రో ఉప ఉత్పత్తులైన ముడి ప్లాస్టిక్ ధరలు దాదాపు 40 శాతం పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు వాపోతున్నాయి. దాంతో ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసే ఇండస్ట్రీలు ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు.. పేపర్ ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. ఒక రోజు ఉన్న ధరలు మరోరోజు ఉండటం లేదు.

నోటు బుక్కులపై జీఎస్టీని 4 నుంచి 12 శాతానికి పెంచడంతో అవి కూడా అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ఇక స్టేషనరీ వస్తువులపైనా ఇదే పరిస్థితి.వాటిపైనా జీఎస్టీ పెరగడంతో పెన్నులు,పెన్సిళ్లు వంటి ధరలు పెరిగిపోయాయి. మరో నెలలో స్కూళ్లు రీ ఓపెన్ అవుతాయనగా ఈ పెరిగిన ధరలు తల్లిదండ్రులకు పెనుభారంగా మారనున్నాయి.

రష్యా, యుక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని.. మనం రోజూ వంటల్లో వాడే సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు కొండెక్కాయి. మ‌న అవ‌స‌రాల్లో ఎక్కువ‌గా ఉక్రెయిన్ నుంచి దిగుమ‌తులే తీర్చేవి. యుద్ధం కార‌ణంగా దిగుమ‌తులు నిలిచాయి. పొద్దుతిరుగుడు నూనెకు కొరత ఏర్పడటంతో ఇతర నూనెలకు డిమాండ్ ఏర్పడి ధరల పెరుగుదలకు దారితీసింది. ఇప్పుడు లీటర్ ధర రీటెయిల్ గా రూ.190 వరకు పలుకుతోంది. యుద్ధం ప్రారంభ‌మైన తొలినాళ్ల‌లో అయితే లీట‌ర్ నూనె ధ‌ర రూ.220 వ‌ర‌కు కూడా చేరింది.

స‌న్ ఫ్ల‌వ‌ర్ ధ‌ర కాస్త త‌గ్గింద‌ని అనుకుంటున్న త‌రుణంలో మ‌రో పిడుగులాంటి వార్త వ‌చ్చింది. ప్రపంచ పామాయిల్ అవసరాల్లో 60 శాతం వరకు తీర్చే ఇండొనేషియా ప్రభుత్వం ఈ విషయంలో తీసుకున్న నిర్ణయమే ధరల మంట పుట్టే అవకాశాలు ఉన్నాయి. తమ దేశంలో పామాయిల్ ధరలను తగ్గించేందుకు ఆ దేశం ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నెల 28 నుంచి ఇది అమలులోకి రానుంది. ఎగుమతుల ద్వారా అధిక ఆదాయం లభిస్తుండటంతో వ్యాపారులు అటువైపే మొగ్గుచూపుతున్నారు. దాంతో దేశంలో పామాయిల్ ధ‌ర‌లు అమాంతం పెరిగిపోతున్నాయి. ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి ఆందోళ‌న‌లు కూడా చేస్తున్నారు. ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా మారే ప్ర‌మాదం ఉండ‌టంతో ప్ర‌భుత్వం ఎగుమ‌తుల‌పై నిషేధం విధించింది. ఇది భార‌త్ పై తీవ్ర ప్ర‌భావం చూపించే అవ‌కాశాలు ఉన్నాయి.

అధికారిక గణాంకాల‌ ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా ఏటా 24 కోట్ల టన్నుల వరకు వంట నూనె వినియోగమవుతోంది. ఇందులో పామాయిల్ వాటా 8 కోట్ల టన్నులు. ఈ పామాయిల్ ఉత్పత్తిలో సింహభాగం ఇండొనేషియాదే. ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల టన్నుల పామాయిల్ వినియోగం జరిగితే అందులో 5 కోట్ల టన్నులు ఇండొనేషియాలోనే ఉత్పత్తి అయ్యి ఎగుమతి అవుతోంది.

మన దేశంలో ఏటా 1.30 కోట్ల టన్నుల ఆయిల్ వినియోగం జరుగుతుండగా ఇందులో 63 శాతం పామాయిలే ఉంది. అంటే సుమారు 85 లక్షల టన్నులు. ఇందులో 45 శాతం ఇండొనేషియా నుంచే దిగుమతి అవుతోంది. అంటే..సుమారు 40 లక్షల టన్నులు. మిగతాది మలేషియా, ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతోంది. ఈ పరిస్థితిలో ఇండోనేషియా తీసుకున్న నిర్ణయంతో ఇండియాలో పామాయిల్ ధరలు కొండెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.ప్రస్తుతం హైదరాబాద్‌లో పామాయిల్ లీటర్ ధర సుమారుగా రూ.160 వరకు ఉంది. ఇది భవిష్యత్తులో రూ.200 దాటినా ఆశ్చర్య‌పోవాల్సిన అవసరంలేదని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version