టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్ ను హస్తగతం చేసుకున్న తర్వాత ఆ కంపెనీలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాపై కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. మస్క్.. ట్రంపు ఖాతాను పునరుద్ధరిస్తారా లేదా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ట్విటర్‌లో పోల్ నిర్వహించిన తర్వాత ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ట్విటర్ అధిపతి ఎలాన్ మస్క్ ఇవాళ ప్రకటించారు. ట్రంప్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. పాత సందేశాలతో కూడిన ఆయన ట్విటర్ ఖాతా ప్రస్తుతం సామాజిక మాధ్యమ వేదికపై కనిపిస్తోంది.
ట్రంప్ ట్విటర్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? అని మస్క్ పోల్ నిర్వహించారు. దీనికి 15 లక్షలకు పైగా మంది తమ స్పందనను తెలియజేశారు. వీరిలో 51.8 శాతం మంది పునరుద్ధరణకు అనుకూలంగా ఓటు వేశారు. మరో 48.2 శాతం యూజర్లు వద్దని తెలిపారు. కానీ మెజారిటీ మంది పునరుద్ధరణకు మొగ్గుచూపడంతో మస్క్ ఆ దిశగానే నిర్ణయం తీసుకున్నారు. ‘ప్రజల తీర్పే దైవ నిర్ణయం’ అని అర్థం వచ్చే లాటిన్ సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘‘బైడెన్ ప్రమాణస్వీకారానికి వెళ్లడం లేదు’’ అంటూ 2021, జనవరి 8న ట్రంప్ చేసిన చివరి ట్వీట్‌తో ప్రస్తుతం ఆయన ఖాతా కనిపిస్తోంది.
The people have spoken.
Trump will be reinstated.
Vox Populi, Vox Dei. https://t.co/jmkhFuyfkv
— Elon Musk (@elonmusk) November 20, 2022