అమెరికాలోని బాల్టిమోర్‌లో ఇటీవల వంతెన ప్రమాదంపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. మొదట ప్రమాద వివరాలు మీడియాకు వెల్లడిస్తూ.. నౌకలో మొదట విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. ఆ తర్వాత నౌకపై నియంత్రణ కోల్పోయామని సిబ్బంది మేరీలాండ్ రవాణాశాఖను అప్రమత్తం చేశారని వెల్లడించారు. నౌక ఢీకొట్టక ముందే అధికారులు వంతెనను మూసివేయడంతో ఎంతో మంది ప్రాణాలు పోకుండా అప్రమత్తమైనట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ప్రమాదం చేసినట్లు ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.
షిప్ నియంత్రణ కోల్పోయిందని గుర్తించి మేరీలాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీని అప్రమత్తం చేసిన నౌకలో ఉన్న భారత సిబ్బందిపై బైడెన్ ప్రశంసలు కురిపించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ ఘటనలో గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపును అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం వరకు నిలిపివేస్తున్నామని అమెరికా తీరరక్షక దళం ప్రకటించింది.