భారత్‌తో వివాదం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ వివాదంతో ట్రూడోపై ఆ దేశ ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేక పెరుగుతోందని కెనడాకు చెందిన గ్లోబల్ న్యూస్ అనే సంస్థ నిర్వహించిన పోల్స్ సర్వేలే తేలింది. ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్‌పై అసత్య ఆరోపణలు చేసిన ట్రూడోకు కెనడాలో జనాదరణ గణనీయంగా పడిపోయిందని ఈ సర్వే నివేదిక వెల్లడించింది. దాదాపు 60శాతం మంది ప్రజలు ట్రూడో పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటున్నట్లు ఈ పోల్స్‌లో తేలింది.
ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ట్రూడోకు ఉన్న పాపులారిటీ పడిపోయిందని, ఇదే సమయంలో ప్రధాని అభ్యర్థి రేసులో ప్రతిపక్షనేత పొయిలివ్రేకు పాపులారిటీ పెరుగుతోందని ఈ సర్వే పేర్కొంది. ప్రస్తుతం ప్రతిపక్ష నేత పియరీ పొయిలివ్రే వైపు దాదాపు 40శాతం మంది కెనడా ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో తేలింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కెనడాలో ఆరోగ్య, గృహరంగాల సమస్యలకు పరిష్కారం చూపడంలో ట్రూడో సర్కార్ విఫలమైందని సర్వేలో పాల్గొన్న ప్రజలు తెలిపినట్లు తేలింది. మరోవైపు జులైలో నిర్వహించిన మరో సర్వేలోనూ గత 50 ఏళ్లలో కెనడా చూసిన అత్యంత చెత్త ప్రధానమంత్రి ట్రూడోనేనని తేలడం గమనార్హం.