ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గత రెండ్రోజులుగా రష్యాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కిమ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు మద్దతిస్తామని కిమ్ ప్రకటించారు. ఈ ఇద్దరు నేతల చర్చల్లో ప్రధానంగా సైనిక అంశాలే ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఇటీవల ఉత్తరకొరియా చేసిన క్షిపణి ప్రయోగాలు చాలా సందర్భాల్లో విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా అందించే టెక్నాలజీ కీలకమని కిమ్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఉత్తరకొరియా ఉపగ్రహ, అంతరిక్ష కార్యక్రమాలను అభివృద్ధి చేసేందుకు పుతిన్ సానుకూలత కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అయితే రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగలేదని రష్యా చెబుతోంది. ప్రస్తుతం రష్యా పర్యటనలోనే ఉన్న కిమ్.. శుక్రవారం రోజున కమ్స్‌మలస్కాన్ అముర్‌లో యుద్ధ విమానాలు తయారు చేసే ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియాలో పర్యటించాల్సిందిగా పుతిన్‌ను కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానించారు. దీనికి రష్యా అధ్యక్షుడు కూడా అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని మాస్కో ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.