ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ తుపాను విలయం సృష్టిస్తోంది. ఈ తుపాను ధాటికి ఇప్పటికే వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని వేల మంది గల్లంతయ్యారు. ఇంకొంతమంది నిరాశ్రయులయ్యారు. ఆ దేశాన్ని తుపాను చిగురుటాకులా వణికిస్తోంది. ముఖ్యంగా డెర్నా నగరంలో డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంలో 11,300 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ రెడ్ క్రెసెంట్ వెల్లడించింది. మరో 10,100 మంది ఆచూకీ దొరకడంలేదని తెలిపింది.
వరద వేలాది మందిని సముద్రంలోకి ఈడ్చుకెళ్లగా.. ఇప్పుడా మృతదేహాలు తిరిగి తీరానికి కొట్టుకొస్తున్నాయని అధికారులు తెలిపారు. సముద్ర తీరం శవాలగుట్టగా మారిందని వెల్లడించారు. ఈ విపత్తులో చాలా వరకు మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతుల్లో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. డెర్నాలో మృతదేహాలను భద్రపరిచే పరిస్థితి లేకపోవడం వల్ల ఇతర నగరాల్లోని మార్చురీలకు తరలిస్తున్నారు. వందల సంఖ్యలో మృతదేహాలను సామూహిక ఖననం చేస్తున్నారు. మరోవైపు వరద ప్రభావం ఎక్కువగా ఉన్న డెర్నా నగరంలో సహాయక చర్యలు చేపట్టేందుకు తుర్కియే, యూఏఈ, ఈజిప్టు, ట్యునీషియా, ఖతార్ నుంచి సహాయక బృందాలు వెళ్లాయి.