అగ్ర రాజ్యంలో మరోసారి తుపాకీ మోత మోగింది. గుర్తు తెలియని వ్యక్తి ఓ యూనివర్సిటీలో కాల్పులు జరిపాడు. ఈ ఘటన లాస్వేగాస్లో బుధవారం రోజున జరిగింది. నెవాడా వర్సిటీలో బుధవారం మధ్యాహ్నం వేళ చొరబడిన ఓ ఆగంతకుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల నుంచి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు విద్యార్థులు పరుగులు తీసి సమీప గదుల్లో దాక్కున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. చనిపోయిన వారిలో అనుమానితుడు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేవలం యూనివర్సిటీలో మాత్రమే కాకుండా నగరంలో మరో చోట కూడా కాల్పులు జరిగినట్లు సమాచారం. దీంతో విశ్వవిద్యాలయంతో పాటు సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా తాత్కాలికంగా మూసి వేశారు.
గత కొన్నేళ్లుగా అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి యూఎస్‌కు వెళ్లిన విద్యార్థులు, యువతే ఈ ఘటనల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు.