ఇప్పటికే ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న పాకిస్థాన్ ఇప్పుడు మాల్దీవులకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. అది కూడా ఆర్థిక సాయం. అసలే దివాలా అంచున వేలాడుతున్న పాకిస్థాన్ నిర్ణయం చూసి కొన్ని దేశాలు విస్తుపోతున్నాయి. గురువారం రోజున మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, పాక్ ప్రధాని అన్వర్ ఉల్‌హక్ కాకర్ ఫోన్‌లో సంభాషించుకున్నారు.
ఇందులో భాగంగా ఇరు దేశాల ప్రాధాన్యాలు, అంతర్జాతీయ వేదికలపై సహకారంపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా మాల్దీవుల అభివృద్ధికి అవసరమైన సాయం తాము అందిస్తామని పాక్ ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాదు పర్యావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి సహకరిస్తామని చెప్పారని సమాచారం
తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్ ఇటీవలే 2 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వాలని చైనాను కోరింది. పాకిస్థాన్ వృద్ధిరేటు పెరుగుదల అంచనాల్లో ఐఎంఎఫ్ 2 శాతం కోత విధించింది. ఇక పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్‌ను విక్రయించి కొంత ఆర్థిక కష్టాలు తీర్చుకోవాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు భారత తాత్కాలిక బడ్జెట్‌లో మాల్దీవులకు ఏటా కేటాయించే సాయంలో కోత విధించింది.